India: కరోనా కారణంగా భారతీయుల ఆయుష్షు తగ్గింది.. తేల్చిన అధ్యయనం

  • పురుషులు, మహిళల్లో సగటున రెండేళ్లు తగ్గుదల
  • ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ స్టడీస్ అధ్యయనం
  • పురుషుల ఆయువు 69.5 నుంచి 67.5 ఏళ్లకు కట్
  • మహిళల్లో 72 నుంచి 69.8కి తగ్గిన వైనం
Indians Life Expectancy Drops By 2 Years On Average

మన దేశంలోకి కరోనా ప్రవేశించి ఏడాదిన్నర దాటిపోయింది. దాని వల్ల కకావికలమైన జీవితాలెన్నో! అనాథలుగా మిగిలిన చిన్నారులెందరో! అన్ని వర్గాల ప్రజలనూ మహమ్మారి కష్టాల ఊబిలోకి నెట్టేసింది. జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు మన ఆయుష్షుకూ పొగ బెట్టేసింది. మన ఆయువులో రెండేళ్లు కోత పెట్టింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

2019లో పరుషుల సగటు ఆయువు 69.5 ఏళ్లు, మహిళల ఆయువు 72 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 67.5 ఏళ్లు, 69.8 ఏళ్లకు తగ్గిపోయినట్టు సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ చెప్పారు. జనాలపై కరోనా మహమ్మారి ప్రభావం ఎంత మేరకుందో తెలుసుకోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా నమోదైన మరణాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. కరోనాతో చనిపోయిన 35–69 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువ మంది పురుషులేనని స్పష్టం చేశారు.

ఆ వయసు వారిలోనే జీవితకాలం తగ్గిందన్నారు. గత దశాబ్దకాలంలో మనం సాధించిన ప్రగతి అంతా కరోనా మహమ్మారితో తుడిచిపెట్టుకుపోయిందని సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆయుష్షు తగ్గడం తాత్కాలికమేనని, ఆ తర్వాత మళ్లీ మెరుగవుతుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్. జేమ్స్ తెలిపారు.

More Telugu News