36 గంటలు దీక్ష చేసిన వ్యక్తి అంతసేపు మాట్లాడగలడా?: చంద్రబాబు దీక్షపై సజ్జల సందేహాలు

22-10-2021 Fri 22:11
  • 36 గంటల దీక్ష చేపట్టిన చంద్రబాబు
  • 72 ఏళ్ల వ్యక్తి అంతసేపు దీక్ష ఎలా చేశాడన్న సజ్జల
  • అరలీటరు నీళ్లతో దీక్ష ఎలా చేశారని ఆశ్చర్యం
  • బాబు దీక్ష ఓ డ్రామా అని వ్యాఖ్య  
Sajjala expresses doubts over Chandrababu protest
టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తి 36 గంటలు దీక్ష చేసి గంటన్నర సేపు ప్రసంగించగలడా? అని ప్రశ్నించారు. అరలీటరు నీళ్లతో 36 గంటల దీక్ష సాధ్యమేనా? 36 గంటలు దీక్ష చేసిన వ్యక్తి అంతసేపు మాట్లాడగలడా? అని అన్నారు.

బాబు ప్రజలను వెర్రివాళ్లలా భావిస్తున్నాడని, బాబు 36 గంటల దీక్ష ఓ డ్రామా అని సజ్జల అభివర్ణించారు. బోషడీకే అనే పదానికి టీడీపీ కొత్త అర్థం చెబుతోందని, బాబు అదే పదంతో అమిత్ షాను కూడా పలకరిస్తారా? అని ప్రశ్నించారు. దీక్ష పేరుతో సంఘ విద్రోహశక్తులన్నీ ఒక్క చోటకు చేరాయని, పేరుకు గాంధేయవాదం.. మాట్లాడేదంతా బూతులు అని విమర్శించారు. దీక్షకు వచ్చినవాళ్లందరూ దాడులు చేస్తామంటూ సవాళ్లు విసిరారని సజ్జల అన్నారు.