నటి సుధా చంద్రన్ కు క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్

22-10-2021 Fri 18:19
  • ఇటీవల ఎయిర్ పోర్టులో సుధకు చేదు అనుభవం
  • కృత్రిమ కాలు తొలగించాలన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది
  • వీడియో రూపంలో ఆవేదన వెలిబుచ్చిన సుధ
  • ఘటనపై పరిశీలన చేపడతామన్న సీఐఎస్ఎఫ్
CISF apologizes actress Sudha Chandran
ఇటీవల ఎయిర్ పోర్టులో నటి సుధాచంద్రన్ పట్ల తమ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. సుధాచంద్రన్ కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విమానాశ్రయంలో సుధాచంద్రన్ కృత్రిమ కాలును తొలగించాల్సిందిగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోరారు. దీనిపై సుధాచంద్రన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

విమానాశ్రయాల్లో నిర్వహించే తనిఖీల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే, సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై పరిశీలన చేపడతామని పేర్కొంది. విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించని రీతిలో తమ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామని సీఐఎస్ఎఫ్ ఆ ప్రకటనలో తెలిపింది.

నటి సుధాచంద్రన్ గతంలో నాట్యకారిణి. ఓ ఘటనలో ఆమె తన కాలును కోల్పోగా, కృత్రిమ కాలును అమర్చుకున్నారు. అయినప్పటికీ తన నాట్యాన్ని కొనసాగించి దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె జీవిత కథతో తనే ప్రధాన పాత్రధారిణిగా 'మయూరి' పేరిట సినిమా కూడా వచ్చింది.