టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని... చంద్రబాబు దీక్షకు మద్దతు

22-10-2021 Fri 17:09
  • కొంతకాలంగా పార్టీకి నాని దూరం
  • ఇటీవల తన ఆఫీసులో చంద్రబాబు ఫొటో తొలగింపు
  • పార్టీ మారతారంటూ ప్రచారం
Kesineni Nani extends his support for Chandrababu
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని తన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర కీలక నేతల ఫొటోలను తొలగించడం తెలిసిందే. పార్టీ అధినాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, పార్టీకి వీడ్కోలు పలకనున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నేటి మధ్యాహ్నం కేశినేని నాని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతు పలికారు.

ఇటీవల కేశినేని నాని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకుల తీరుతో అసంతృప్తికి గురై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదన్న తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికల వేళ బొండా ఉమ, బుద్ధా వెంకన్నలతో కేశినేని నానికి విభేదాలు తెలిసిందే.