పవన్ సినిమాకు ఓటీటీ నుంచి భారీ ఆఫర్?

22-10-2021 Fri 17:02
  • రీమేక్ చిత్రంగా 'భీమ్లా నాయక్'
  • హీరోలుగా పవన్ కల్యాణ్, రానా
  • పవన్ సరసన నిత్యా మీనన్
  • అమెజాన్ నుంచి రూ.150 కోట్ల ఆఫర్       
Fancy offer from OTT to Pawan Kalyans movie
ఈవేళ సినిమాలకు థియేటర్లే కాకుండా ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ ఫారాలు కూడా తోడయ్యాయి. ఒక సినిమాకున్న క్రేజ్ ను బట్టి అది నిర్మాణంలో ఉండగానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం భారీ మొత్తాలలో ఆఫర్ చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్సీ ఆఫర్లతో నిర్మాతలను టెంప్ట్ చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో బాగా జరుగుతోంది. ఆఫర్లు బాగుండడంతో కొందరు నిర్మాతలు వాటికి కమిట్ అయిపోతున్నారు కూడా. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి అమెజాన్ ప్రైమ్ నుంచి ఓ భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు సమకూరుస్తున్నారు. పవన్ కి జంటగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ ఇందులో నటిస్తున్నారు. ఇప్పుడీ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ నుంచి రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న మేకర్స్ ఈ ఆఫర్ కి ఒప్పుకుంటారా? అన్నది చూడాలి!