హీరో కాదు .. కంటెంట్ కావాలి: 'నాట్యం' హీరోయిన్

22-10-2021 Fri 11:36
  • ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చాను
  • ఇతర భాషల్లో నటించాను
  • కథ బాగుంటేనే చేస్తాను
  • హీరోల వల్ల వచ్చే మైలేజ్ కోసం చూడను
Natyam movie update
తెలుగు తెరపై నాట్యప్రధానమైన సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. 'ఆనందభైరవి' .. 'స్వర్ణకమలం' .. 'సాగర సంగమం' వంటి కొన్ని సినిమాలు మాత్రమే నాట్యంతో ముడిపడి నడిచాయి. మళ్లీ ఇంతకాలానికి 'నాట్యం' ప్రధానమైన అంశంగా ఒక సినిమా వచ్చింది. సంధ్య రాజు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

ఈ సందర్భంగా సంధ్యరాజు మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి చాలా నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో చేశాను. కమర్షియల్ పేరుతో కథ నచ్చకపోయినా చేయలేను. ఫలానా హీరోతో చేయడం వలన మైలేజ్ ఉంటుందంటే, అలాంటి మైలేజ్ నాకు అవసరం లేదు.

 ఏ సినిమాకైనా కథనే ప్రధానం .. కథ బాగుంటే చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. ఏ పాత్రను పడితే ఆ పాత్రను చేయను. 'నాట్యం' సినిమాలో నటించడం .. నిర్మించడం నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కి తీసుకురావడానికి మాత్రం చాలానే కష్టపడ్డాను" అని చెప్పుకొచ్చారు.