Tollywood: తెలుగు ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ రూపంలో మరో పవన్ కల్యాణ్ దొరికాడు: దిల్ రాజు

Telugu Industry Have Another Pawan Kalyan Says Dil Raju
  • అతి తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్
  • విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకొనే ‘రౌడీబాయ్స్’ టైటిల్
  • మా బ్యానర్ లో సినిమా చేసేందుకు ఎంతగానో ట్రై చేశాడు
  • కొన్ని కారణాలతో అది కుదరలేదు
తెలుగు సినీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ రూపంలో మరో పవన్ కల్యాణ్ దొరికాడని నిర్మాత దిల్ రాజు అన్నారు. అప్పట్లో రెండు మూడు సినిమాలకే పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో.. ఇప్పుడు విజయ్ దేవరకొండకూ అలాగే వచ్చిందని చెప్పారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’తో విజయ్ స్టార్ డమ్ దక్కించుకున్నాడన్నారు. తన కుటుంబానికి చెందిన ఆశిష్ ను ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా దిల్ రాజు పరిచయం చేస్తున్నారు. సినిమా రెండో సాంగ్ విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ పై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.

కథాంశం ఆధారంగానే సినిమాకు ‘రౌడీ బాయ్స్’ అనే పేరు పెట్టామని, విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకున్నాకే పేరు ఖరారు చేశామని తెలిపారు. వాస్తవానికి తమ బ్యానర్ లో వచ్చిన ‘కేరింత’ సినిమాలోని ముగ్గురు నాయకుల్లో ఒక నాయకుడిగా విజయ్ దేవరకొండ నటించాల్సి ఉందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఫొటోషూట్ సమయంలో విజయ్ ను దూరం నుంచే చూశానన్నారు.

ఆ తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాను తమ బ్యానర్ ద్వారా విడుదల చేసేందుకు విజయ్ ప్రయత్నించినా.. ఆ సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల కుదరలేదని తెలిపారు. తర్వాత ‘గీతగోవిందం’ సినిమా సక్సెస్ మీట్ కు తాను వెళ్లానని, అక్కడ విజయ్ ఫాలోయింగ్ ను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ప్రస్తుతం విజయ్ నటించిన లైగర్ సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని ఆకాంక్షించారు.
Tollywood
Vijay Devarakonda
Dil Raju
Rowdy Boys

More Telugu News