Telangana: చేతగాకనే ఈసీ పేరు చెప్పుకొని దళితబంధును ఆపేశారు.. బండి సంజయ్ మండిపాటు

Sanjay Challenges TRS Government Over Dalitabandhu Scheme
  • నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా?
  • యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణానికి సిద్ధమా?
  • ఎక్కడ ఎన్నికలుంటే అక్కడే పథకాల ప్రకటన
  • సాగర్ ఎన్నికలయ్యాక గొర్రెల పంపిణీ ఆగింది
దళితబంధు పథకం నిలిపివేతపై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఆయన ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ వాళ్లే ఎన్నికల సంఘానికి దళితబంధును ఆపించాలంటూ లేఖలు రాశారని, ఆ నెపాన్ని రివర్స్ లో బీజేపీ మీదకు నెడుతున్నారని ఆరోపించారు.

తీరా ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలను ప్రకటిస్తారని, చేతగాక ఈసీ పేరు చెప్పి నిలిపివేస్తారని టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు నిధులను ఖాతాల్లో వేసినా.. విత్ డ్రా చేసుకోనివ్వలేదని ఆయన విమర్శించారు. ఖాతాల్లో వేసిన నిధులను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. దళితబంధు నిధులు ఇవ్వాలని ముందు నుంచీ బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

దళితబంధును ఆపాలంటూ లేఖ రాశానని టీఆర్ఎస్ వాళ్లు ఆరోపిస్తున్నారని, దానిని నిరూపిస్తారా? అని నిలదీశారు. దీనిపై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ చేశారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ పథకాలను అమలు చేస్తున్నారని, అక్కడ ఎన్నికలు అయిపోగానే ఆపేస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత గొర్రెల పంపిణీ ఆగిపోయిందని గుర్తు చేశారు.
Telangana
BJP
Bandi Sanjay
Dalita Bandhu

More Telugu News