ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు.. వీడియో

20-10-2021 Wed 12:07
  • విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గృహ నిర్బంధం
  • అనంతపురంలో పరిటాల సునీత హౌస్ అరెస్ట్
  • కాలువ శ్రీనివాసులు అరెస్ట్ చేసిన పోలీసులు
  • నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
TDP Bandh Bandh Across AP Continues
టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ ఆఫీసులపై దాడులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన బంద్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలను ముందస్తుగానే గృహ నిర్బంధం చేశారు. రోడ్ల మీదకొచ్చిన నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

అనంతపురం జిల్లా వెంకటపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురంలో ఆ పార్టీ నేత బీకే పార్థసారథిలను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురంలో నిరసన తెలిపిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతపురం సప్తగిరి కూడలిలో టైర్లను కాల్చి రోడ్డుపై వేశారు. ఇటు ఉత్తరాంధ్రలో తెల్లవారుజామునుంచే పార్టీ నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి.

చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పుంగనూరు, తిరుపతిలలో ఆందోళన చేపట్టిన పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తదితర నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలో పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఇంట్లోనే నేలపై కూర్చుని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలోని ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనల కోసం బయల్దేరుతున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. పోలీసుల ముందే టీడీపీ జెండాలను తగులబెడుతున్నా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కాగా, రాష్ట్ర సర్కార్, పోలీసుల ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు, ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.