అఖిల్ కి హిట్ పడటం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన చరణ్!

19-10-2021 Tue 18:59
  • హిట్ టాక్ తెచ్చుకున్న 'బ్యాచ్ లర్'
  • అఖిల్ నటనకు ఫిదా అయ్యానన్న చరణ్
  • పాత్రలో జీవించావు అంటూ పూజకు ప్రశంసలు
  • ఎంజాయ్ చేశామంటూ టీమ్ కి శుభాకాంక్షలు
Charan comments to Bachelor movie
అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను తెరకెక్కించాడు. విజయదశమి కానుకగా ఈ సినిమా ఈ నెల 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్ల గ్రాస్ ను రాబట్టడం అఖిల్ కెరియర్లో ఇదే ఫస్టు టైమ్.

ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. "తమ్ముడు అఖిల్ ఈ సినిమాతో నువ్వు హిట్ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ యాక్టింగ్ చూసి నేను ఫిదా అయ్యాను. పూజా ఇక నువ్వు నీ పాత్రలో జీవించావు. దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు. ఈ సినిమాను మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము" అని ట్వీట్ చేశాడు.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా అఖిల్ 'ఏజెంట్' చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో అఖిల్ ను ఆయన కొత్త లుక్ తో చూపించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.