సరిహద్దుల్లో చైనా కవ్వింపులు... పెట్రోలింగ్, సైనిక శిక్షణను పెంచిన వైనం!

19-10-2021 Tue 13:08
  • వెల్లడించిన ఈస్టర్న్ ఆర్మీ కమాండర్
  • సాయుధ బలగాలను ఒక్క చోటుకి చేర్చిందని వెల్లడి
  • ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని కామెంట్
  • డ్రోన్లు, రాడార్లతో నిఘా పెడుతున్నామన్న అధికారి
China Marginally Increases Patrolling Activities Across Borders
సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపులకు పాల్పడుతోంది. కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతోంది. భారత్ తో ఉన్న అన్ని సరిహద్దుల్లోనూ డ్రాగన్ దేశం పెట్రోలింగ్ ను, సైన్యాన్ని పెంచేసిందని ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సైనిక శిక్షణ శిబిరాలనూ పెంచిందన్నారు. కీలకమైన లోతైన ప్రాంతాల్లో (లోయలు/ఫింగర్స్) యాక్టివిటీ పెరిగిందన్నారు.

‘‘సరిహద్దుల్లో సమీకృత సంయుక్త ఆపరేషన్ ఎక్సర్ సైజులను పెంచింది. సాయుధ బలగాల్లోని వివిధ విభాగాలను ఒక్క చోటుకి చేర్చి ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఎప్పుడూ జరిగేదే అయినా.. ఈ ఏడాది ఇంతకుముందుతో పోలిస్తే డోసు పెంచింది. ఎక్కువ మందితో ఎక్కువ కాలం పాటు ఆ ఎక్సర్ సైజులను కొనసాగిస్తోంది’’ అని ఆయన తెలిపారు.

పెట్రోలింగ్ విధానాల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. పెట్రోలింగ్ మాత్రం ఎక్కువైందని ఆయన చెప్పారు. ఏడాదిన్నరగా చైనా చర్యలు ఆందోళన కలిగించేలానే ఉన్నాయని, చైనా నుంచి అనుకోని ఎటాక్ ఎదురైనా ఎదుర్కొనేందుకు ఈస్టర్న్ కమాండ్ సదా సిద్ధంగా ఉందని మనోజ్ స్పష్టం చేశారు. చైనాకు దీటుగా భారత్ కూడా వాస్తవాధీన రేఖ వద్ద మౌలిక వసతులను పెంచుతోందని తెలిపారు.

ఎల్ఏసీ వద్ద నిఘా కోసం డ్రోన్లు, సర్వీలెన్స్ రాడార్లు, మెరుగైన సమాచార వ్యవస్థలను వినియోగిస్తున్నామని చెప్పారు. రక్షణలో సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నామన్నారు.