నేను విమర్శించింది జగన్ ను కాదు.. ఆ ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి

19-10-2021 Tue 12:33
  • జగన్ ను విమర్శిస్తూ కేతిరెడ్డి మాట్లాడినట్టు ఓ ఛానల్ లో కథనం
  • తల, తోక లేని క్లిప్పింగులు ప్రసారం చేశారన్న పెద్దారెడ్డి
  • వైయస్ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా విధేయులుగా ఉన్నామని వ్యాఖ్య
Ketireddy Pedda Reddy gives clarity on her comments on Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడినట్టున్న ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. ఓ న్యూస్ ఛానల్ ఈ వార్తను ప్రధానంగా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో సదరు న్యూస్ ఛానల్ పై పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలను... జగన్ ను ఉద్దేశించి మాట్లాడినట్టు ఆపాదించారని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన మోసాల గురించి, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తాను మాట్లాడానని చెప్పారు.

తల, తోక లేని క్లిప్పింగులను సదరు ఛానల్ ప్రసారం చేయడం బాధాకరమని అన్నారు. తాను మాట్లాడిన పూర్తి వీడియోను ప్రసారం చేయాలని... అందులో జగన్ ను విమర్శించినట్టు ఉంటే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పారు. అసత్య కథనాన్ని ప్రసారం చేసిన సదరు ఛానల్ పై చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని అన్నారు.

 వైయస్ కుటుంబానికి కేతిరెడ్డి కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా విధేయంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయానికి తన ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపారు. తనపై అంత నమ్మకం పెట్టుకున్న వ్యక్తిని తాను ఎలా విమర్శిస్తానని అన్నారు. వంద ఎల్లో ఛానళ్లు కలసికట్టుగా పని చేసినా తమ కుటుంబాల మధ్య ఉన్న బంధాన్ని విడదీయలేవని చెప్పారు.