టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు.. ఉద్రిక్తత

19-10-2021 Tue 07:49
  • రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందన్న మాజీ మంత్రి
  • ఎక్కడెక్కడ దొరుకుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు
  • విశాఖ నుంచి నోటీసులతో గుంటూరు వచ్చిన పోలీసులు
  • ఆధారాలు ఇచ్చే బాధ్యత తనది కాదన్న ఆనందబాబు
Visakha police try to give notices to TDP leader Nakka Anand Babu
గుంటూరులోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద గత అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆనందబాబు.. రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విశాఖపట్టణం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు గత అర్ధరాత్రి గుంటూరు వచ్చారు.

గంజాయి ఏయే ప్రాంతాల్లో దొరుకుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క విశాఖలోనే కాదని,  రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు. గుంటూరులోనూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి, నాలుగు రోజులు ఏపీలో ఉన్నారని, ఓ మాజీ మంత్రిగా దీనిపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే బాధ్యత తనది కాదని అన్నారు.

 ఏపీ డీజీపీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారని, ప్రతిపక్ష నేతలు కొత్త అంశాల గురించి మాట్లాడితే వెంటనే నోటీసులు ఇస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆనందబాబు ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సింది పోయి, దానిపై మాట్లాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని ఆలపాటి మండిపడ్డారు.