Hyderabad: బాలుడితో ప్రేమలో బాలిక.. మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని మట్టుబెట్టిన వైనం!

Minor girl killed her mother with the help of boyfriend
  • హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఘటన
  • మందలించిందన్న అక్కసుతో మెడకు చున్నీ బిగించి హత్య
  • నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
తమ ప్రేమకు అడ్డుగా ఉందన్న అక్కసుతో సొంత తల్లినే ప్రియుడితో కలిసి హతమార్చిందో బాలిక. హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌మెట్‌కు చెందిన బాలిక (17) అదే ప్రాంతానికి చెందిన బాలుడి (17)తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి తిరుగుతున్న విషయం తెలిసిన బాలిక తల్లి కుమార్తెను మందలించింది. అయినప్పటికీ బాలిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నిన్న మరోమారు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. దీంతో తమ ప్రేమకు తల్లి ఎప్పటికైనా అడ్డమేనని భావించిన బాలిక.. బాలుడిని ఇంటికి పిలిపించింది.

అనంతరం తల్లితో గొడవకు దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన బాలిక.. తల్లి మెడకు చున్నీ బిగించి ప్రియుడి సాయంతో హతమార్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిర్భయంగా ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక తండ్రి జరిగిన ఘోరం చూసి పోలీసులకు సమాచారం అందించారు.

 ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులైన బాలుడు, బాలికను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరూ హత్యను అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Hyderabad
Rajendranagar
Crime News
Girl
Love
Murder

More Telugu News