Curtis Campher: టీ20 వరల్డ్ కప్: వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఐర్లాండ్ బౌలర్

  • హ్యాట్రిక్ నమోదు చేసిన కాంఫర్
  • ఆ తర్వాత బంతికి మరో వికెట్
  • 106 పరుగులకే కుప్పకూలిన నెదర్లాండ్స్
  • 51 పరుగులు చేసిన ఓడౌడ్
Irish bowler Curtis Campher takes four wickets in four balls against Nederlands

టీ20 వరల్డ్ కప్ తొలిదశ పోటీల్లో అద్భుత బౌలింగ్ స్పెల్ నమోదైంది. ఐర్లాండ్ యువ పేసర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్ పై వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 22 ఏళ్ల కర్టిస్ కాంఫర్ తొలుత అకెర్మన్ (11) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత సీనియర్ ఆటగాడు ర్యాన్ టెన్ డష్కాటేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆపై అదే తరహాలో బంతి వేసి స్కాట్ ఎడ్వర్డ్స్ ను కూడా ఎల్బీడబ్ల్యూ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాదు, ఆ తర్వాత బంతికి రైలోఫ్ వాన్ డెర్ మెర్వ్ ను బౌల్డ్ చేసి తన నాలుగో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. కాంఫర్ ఈ నలుగురిలో ముగ్గుర్ని డకౌట్ చేశాడు.

ఇక, మార్క్ అడైర్ విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నెదర్లాండ్స్ ఆఖరి మూడు వికెట్లను కోల్పోయింది. మొత్తానికి ఓవర్లన్నీ ఆడి 106 పరుగులకు ఆలౌట్ అయింది. కాంఫర్ కు 4, అడైర్ కు 3 వికెట్లు, జాషువా లిటిల్ కు 1 వికెట్ లభించాయి. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ సాధించిన 51 పరుగులే అత్యధికం. ఆ జట్టులో ఐదుగురు డకౌట్ అయ్యారు.

కాగా, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లలో కర్టిస్ కాంఫర్ మూడోవాడు. గతంలో రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), లసిత్ మలింగ (శ్రీలంక) ఈ ఘనత సాధించారు.

More Telugu News