స్లిమ్ లుక్ లో ఖుష్బూ... ఎలా బరువు తగ్గిందంటే..!

16-10-2021 Sat 21:43
  • గత నవంబరులో ఖుష్బూ బరువు 92 కిలోలు
  • ఇప్పుడు 15 కిలోలు తగ్గిన వైనం
  • కఠిన ఆహార నియమాలు, యోగాతో బరువు తగ్గిన ఖుష్బూ
  • లాక్ డౌన్ లో ఇంటిపనంతా తానే చేశానని వెల్లడి
Khushbu explains how she lost fifteen kg weight
ఒకప్పుడు అందాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. బొద్దుగుమ్మగా అందరికీ తెలిసిన ఖుష్బూ ఇటీవల స్లిమ్ లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన వెయిట్ లాస్ గురించి ఖుష్బూ తాజాగా వివరించింది. తమిళంలో డ్యాన్స్ వర్సెస్ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ ఆసక్తికర అంశాలు పంచుకుంది.

దర్శకుడు సుందర్ తో పెళ్లి, పిల్లలు నేపథ్యంలో 20 కిలోల బరువు పెరిగినట్టు వెల్లడించింది. అయితే, లాక్ డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టానని, ఇప్పుడు 15 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఎప్పుడో తన పెళ్లి నాడు వేసుకున్న దుస్తులు కూడా ఇప్పుడు సరిపోతున్నాయని ఆనందంగా చెప్పింది. బరువు తగ్గడం కోసం బిర్యానీలు, ఐస్ క్రీములు త్యాగం చేశానని, క్రమం తప్పకుండా యోగా చేశానని వివరించింది. రోజూ 40 నిమిషాల పాటు నడిచేదాన్నని వెల్లడించింది.

లాక్ డౌన్ లో ఇంటి పనంతా తానే చేశానని తెలిపింది. అంట్లు తోమడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని పనుల చేశానని ఖుష్బూ పేర్కొంది. 2020 నవంబరులో తన బరువు 92 కిలోలు అని, ఇప్పుడది 77 కిలోలకు తగ్గిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు తన టార్గెట్ 69 కిలోలకు తగ్గడం అని, అందుకు తగిన విధంగా శ్రమిస్తున్నానని, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని, అనుకున్నది సాధిస్తానని ఖుష్బూ ధీమాగా చెప్పింది.