కేటీఆర్ గారూ.. నా బుల్లెట్ బండిపై పాతబస్తీకి వెళదాం రండి: రాజాసింగ్ ఆహ్వానం

16-10-2021 Sat 20:38
  • హైదరాబాదులో భారీ వర్షాలు
  • జనజీవనం అస్తవ్యస్తం అయిందన్న రాజాసింగ్
  • క్షేత్రస్థాయిలో ఎలా ఉందో కేటీఆర్ చూడాలని సూచన
  • నాలాలు ఉప్పొంగి ఇళ్లు, దుకాణాల్లోకి నీరు వెళుతోందని వెల్లడి
Raja Singh invites KTR for a ride in city
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. నగరంలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో చూసొద్దాం రండి అంటూ ఆహ్వానించారు.

"నిధుల గురించి, పాతబస్తీ అభివృద్ధి గురించి మీరు పదేపదే శాసనసభలో చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనిద్దరమే వెళ్లి చూసొద్దాం. నా బుల్లెట్ బండిపై మొదట గోషామహల్ నియోజకవర్గంలో పర్యటిద్దాం, ఆ తర్వాత పాతబస్తీలో పర్యటిద్దాం" అని తెలిపారు. భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో రియాలిటీ ఎలా ఉందో మీరే చూడొచ్చు...  ఏం అభివృద్ధి జరిగిందో మీ అంతట మీరే తెలుసుకోవచ్చు! అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగుతున్నాయని, నీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి వెళుతోందని, జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని రాజాసింగ్ వివరించారు.