Naresh: మొన్న విష్ణు బాధ్యతలు స్వీకరించిన రోజున నేను కన్నీళ్లతో బయటికి వస్తుంటే ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదు: నరేశ్

Actor Naresh opines on recent developments in MAA related issue
  •  నేడు మంచు విష్ణు కార్యవర్గం ప్రమాణస్వీకారం
  • మా భవిష్యత్తుపై భరోసా ఏర్పడిందన్న నరేశ్
  • మంచు విష్ణు సమర్థుడని కితాబు
  • ఎవరికీ రిపోర్టు కార్డు ఇవ్వాల్సిన పనిలేదని వ్యాఖ్యలు
  • ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్
'మా' నూతన కార్యవర్గం నేడు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో నటుడు నరేశ్ స్పందించారు. 'మా' అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలన్న ఉద్దేశంతోనే విష్ణుకు మొన్ననే బాధ్యతలు అప్పగించామని నరేశ్ వెల్లడించారు.

మొన్న విష్ణు బాధ్యతలు స్వీకరించిన రోజు తాను కన్నీళ్లతో 'మా' కార్యాలయం నుంచి బయటికి వచ్చానని, అయితే ఎందుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానో అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదని అన్నారు. 'మా' పనితీరు మెరుగుపడేందుకు ఆరేళ్లు పోరాడానని, ఆరేళ్ల శ్రమకు ఒక మంచి భవిష్యత్ కనపడిందన్న నమ్మకంతో ఆ రోజున తాను ఆనందబాష్పాలు రాల్చానని వెల్లడించారు. మంచు విష్ణు నాయకత్వంలో 'మా' మరింత ముందుకు వెళుతుందన్న భరోసా కలిగిందని పేర్కొన్నారు.

గతంలో తాను 'మా' అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే నేడు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుపొందాడని కితాబునిచ్చారు. 'మా' సభ్యులకు విష్ణుపై ఉన్న నమ్మకమే భారీ మెజారిటీకీ కారణమని నరేశ్ వివరించారు.

ఇక, 'మా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కూడా నరేశ్ స్పందించారు. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసినా బయట ఉంటూనే 'మా' తరఫున విష్ణు చేసే మంచి పనులకు మద్దతు ఇస్తామని, ప్రతి నెలా రిపోర్టు కార్డు అడుగుతామని ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకు నరేశ్ బదులిస్తూ, మంచు విష్ణు కార్యవర్గం ఎవరికీ రిపోర్టు కార్డు ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. 'మా' పనితీరు వివరాలు కావాలంటే వెబ్ సైట్లో చూసుకోండి అని సూచించారు.
Naresh
MAA
Manchu Vishnu
Prakash Raj
Tollywood

More Telugu News