Bangladesh: బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింస.. ఇద్దరు హిందువుల హత్య

Two Hindus killed in fresh communal violence in Bangladesh
  • దుర్గ పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు
  • హిందూ దేవాలయాలను, హిందువులను టార్గెట్ చేస్తున్న ముస్లింలు
  • ఇప్పటి వరకు ఆరుగురి మృతి
బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. దుర్గ పూజ సందర్భంగా కొన్ని హిందూ దేవాలయలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని... వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చెప్పారు. అయినా అక్కడ హింస చోటు చేసుకుంటూనే ఉంది.

తాజాగా చెలరేగిన హింసలో ఇద్దరు హిందువులను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు మరణాలతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఓ మందిరంలో ఉన్న హిందూ దేవత విగ్రహం మోకాలిపై ఖురాన్ ను ఉంచిన ఫుటేజీ బుధవారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.

శుక్రవారం నాడు ప్రార్థనలు ముగించుకున్న తర్వాత బేగంగంజ్ పట్టణంలో వందలాది ముస్లింలు రోడ్లను ఆక్రమించుకున్నారు. నిన్న పండుగ సందర్భంగా హిందువులు పూజకు సిద్ధమవుతున్న సమయంలో 200 మంది ముస్లిం ఆందోళనకారులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. టెంపుల్ కమిటీ హెడ్ ను కొట్టి చంపేశారు.

ఈ ఉదయం గుడి సమీపంలోని కొలను వద్ద మరో మృతదేహం కనిపించింది. ఆ తర్వాత హిందూ వ్యతిరేక నిరసనలు మరో 12 జిల్లాలకు విస్తరించాయి. బుధవారం నుంచి కనీసం నలుగురు చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. తాజా మరణాలతో కలిసి మృతుల సంఖ్య 6కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా కనీసం 150 మంది హిందువులు గాయపడ్డారని చెపుతున్నారు. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో తరచుగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి.
Bangladesh
Communal Violence
Hindu
Murder

More Telugu News