ఇంతకష్టం ఇంతవరకూ పడలేదు: విజయ్ దేవరకొండ

15-10-2021 Fri 11:15
  • చివరిదశలో 'లైగర్' షూటింగ్
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ  
  • అతిథి పాత్రలో మెరవనున్న మైక్ టైసన్
  • హైలైట్ గా నిలవనున్న మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
Liger movie updare
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో కథానాయికగా 'అనన్య పాండే' తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాను పూరి - ఛార్మి కలిసి నిర్మించాలనుకున్నారు. కానీ కంటెంట్ నచ్చడంతో కరణ్ జొహార్ టీమ్ కూడా నిర్మాణ భాగస్వాములయ్యారు.

కరోనా కారణంగా వాయిదా పడుతూ .. తిరిగి మొదలవుతూ ఈ సినిమా షూటింగు పరంగా చివరిదశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ స్పందించాడు. "ఇంతవరకూ నేను ఏ సినిమాకి కూడా ఇంత కష్టపడలేదు. అలాంటి కష్టం ఈ సినిమా కోసం పడినందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మైక్ టైసన్, ఈ సినిమాలో గెస్టుగా కనిపించనుండటం విశేషం. ఇక కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ .. రోనిత్ రాయ్ .. మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.