Nagam Janardhan Reddy: ఆ కేసులతో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడం అసాధ్యం: నాగం జనార్దన్ రెడ్డి

Not possible to put Revanth Reddy in jail says Nagam Janardhan Reddy
  • కేసీఆర్ భరతం పట్టేందుకే రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు
  • రాయలసీమను రతనాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నారు
  • వ్యవసాయమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెడతామంటూ టీఆర్ఎస్ నేతలు చెపుతున్నారని... ఆయనపై ఉన్న కేసులతో ఆయనను జైల్లో పెట్టడం సాధ్యం కాదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రేవంత్ పై ఉన్న కేసులు ఎన్నికల సంఘం పరిధిలోవని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భరతం పట్టేందుకే రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని... ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ గతంలో సీఎం హోదాలో తిరుపతికి వెళ్లినప్పుడు రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారని... అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నేతల నోళ్లు ఏమయ్యాయని నాగం ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పెట్టిన మోటార్లను కిందకు దింపి, నాలుగు బోల్టులు బిగించి, కొబ్బరికాయలు కొడుతున్నారని విమర్శించారు. కోయిల్ సాగర్, బీమా, నెట్టెంపాటు, కల్వకుర్తి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని చెప్పారు. ప్రాజెక్టు పంపుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

నిబంధనలకు విరుద్ధంగా 300 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతోందని... అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Nagam Janardhan Reddy
Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News