Sajjala Ramakrishna Reddy: రేపోమాపో సజ్జల మంత్రి అవుతారు.. అప్పుడు ఆయన అన్ని శాఖలను చూస్తారా?: రఘురామకృష్ణరాజు

  • ఏ సమస్య వచ్చినా సజ్జలే మాట్లాడుతున్నారు
  • వైసీపీ ప్రభుత్వంలో రూ. 2.87 లక్షల కోట్ల అప్పులు చేశారు
  • కోల్ ఇండియాకు ఏపీ రూ. 300 కోట్ల బాకీ ఉంది
Sajjala is responding to all issues says Raghu Rama Krishna Raju

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. అమ్మఒడి నిధులను జూన్ నెలకు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్టేనని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అమ్మఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారని... ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేపో మాపో సజ్జల మంత్రి అవుతారని... అప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖను మాత్రమే చూస్తారా? లేక సకల శాఖలను చూస్తారా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 2.87 లక్షల కోట్ల అప్పులు చేశారని... ప్రభుత్వ ఖజానాలోని రూ. 1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సమస్య వల్ల రాష్ట్ర అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని అన్నారు. జగనన్న కొవ్వొత్తి-అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్ తో తాను చర్చించానని...  కోల్ ఇండియాకు ఏపీ రూ. 300 కోట్ల బాకీ ఉందని ఆయన తనతో చెప్పారని తెలిపారు.

More Telugu News