తల్లి తలలో కాల్చిన రెండేళ్ల కొడుకు.. అక్కడికక్కడే మృతి

14-10-2021 Thu 13:08
  • అమెరికాలోని ఫ్లోరిడాలో దుర్ఘటన
  • పిల్లాడి దగ్గర తుపాకీ పెట్టినందుకు తండ్రిపై కేసు
  • తుపాకులను లాక్ చేసి పెట్టుకోవాలని పోలీసుల సూచన
US Woman Dies As Her 2 Year Old Child Shoots Her In Head

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఓ తల్లిని బలితీసుకుంది. ఆటబొమ్మనుకున్నాడో ఏమోగానీ.. తుపాకీతో ఆడుకుంటూ తన తల్లిని కాల్చాడు రెండేళ్ల చిన్నారి. జూమ్ లో లైవ్ మీటింగ్ లో ఉన్న ఆమె.. అక్కడికక్కడే మరణించింది. వెంటనే మీటింగ్ లోని  వారంతా 911కు సమాచారమిచ్చారు. మృతురాలిని పోలీసులు షమాయా లిన్ (21)గా గుర్తించారు.

పిల్లాడి దగ్గర తుపాకీ పెట్టినందుకు అతడి తండ్రి వీండ్రే అవెరీ (22) మీద పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. వారికి మొత్తం ముగ్గురు పిల్లలున్నారని, మిగతా ఇద్దరు పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. లిన్ తలలో చిన్నారి కాల్చాడని, ఒక్కటే బుల్లెట్ ఫైర్ అయిందని చెప్పారు. ప్రజలు తుపాకులను లాక్ చేసి పెట్టుకోవాలని సూచించారు.