వరంగల్ జిల్లాలో ప్రారంభమైన ‘కొండా’ సినిమా షూటింగ్.. ‘శివ’ సినిమాను దాటిపోతుందన్న ఆర్జీవీ

13-10-2021 Wed 06:33
  • సురేఖ వెంట మురళి తిరిగినట్టుగా తిరిగా
  • నిజాన్ని మాత్రమే తెరకెక్కిస్తా: ఆర్జీవీ
  • మా జీవిత కథ భిన్నమైనది కాబట్టే ఆర్జీవీ ముందుకొచ్చారు: సురేఖ
RGVs Konda Movie Shooting Started in Geesukonda warangal dist

వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు కొండా మురళీధర్‌రావుపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ సినిమా షూటింగ్ నిన్న జిల్లాలోని గీసుకొండ మండలం వంచనగిరిలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. కొండా బయోపిక్ తీయడానికి తాను ఆయన వెంట తిరగాల్సి వచ్చిందని అన్నారు. సురేఖ వెంట మురళి తిరిగినట్టుగా తాను తిరిగానని అన్నారు. తాను నిజాన్ని మాత్రమే ప్రేక్షకుల ముందు ఉంచుతానని, అది నెగెటివా? పాజిటివా? అనే విషయాన్ని వారే చెప్పాలని అన్నారు. ‘శివ’ సినిమాను ఇది దాటిపోతుందని, చరిత్ర సృష్టిస్తుందని ఆర్జీవీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొండా సురేఖ మాట్లాడుతూ.. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనది కాబట్టే సినిమా తీసేందుకు ఆర్జీవీ ముందుకొచ్చారని అన్నారు. సినిమా షూటింగును ప్రారంభించిన ఆమె.. సినిమాలో ఎలా చూపించినా మీ ఇష్టం అంటూ మురళి చేతిని ఆర్జీవీ చేతిలో వేశారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీసుకొండ మండలంలోని కోటమైసమ్మ ఆలయాన్ని సందర్శించిన వర్మ అమ్మవారికి విస్కీ నైవేద్యంగా సమర్పించడం గమనార్హం.