ప్రజలను మళ్లీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ సర్కార్ కుట్ర పన్నుతోంది: విజయశాంతి

12-10-2021 Tue 15:19
  • గతంలో బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు చేపట్టారు 
  • అప్పుడు 210 తీర్మానాలు చేశారని వివరణ
  • ఇప్పుడవన్నీ అటకెక్కాయంటూ విమర్శలు 
  • దళితులను కూడా మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపణ 
Vijayasanthi slams TRS govt again

తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయని పేర్కొన్నారు. ఆ సమావేశాల్లో 210 తీర్మానాలు చేసి ఆమోదించారని, ఇప్పుడవన్నీ అటకెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే మిగిలిందని వెల్లడించారు.

ఏదో చేయబోతున్నట్టు అప్పట్లో హైప్ సృష్టించి, 2018 ఎన్నికల్లో గెలిచాక ఆ తీర్మానాలను మూలనపడేశారని విజయశాంతి ఆరోపించారు. ఇప్పుడు కులవృత్తుల పేరిట ప్రజలను మళ్లీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ దళిత ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గతంలో దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీతో పాటు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హామీని కూడా తుంగలో తొక్కారని వివరించారు. ఇప్పుడు దళిత సాధికారత అంటూ దళిత బంధు అనే పథకంతో దళితులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలను రాష్ట్ర సర్కారు మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడతారని విజయశాంతి స్పష్టం చేశారు.