Virat Kohli: ఆర్సీబీతో అనుబంధంపై విరాట్ కోహ్లీ స్పష్టత

  • ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓటమి
  • ఆర్సీబీ కెప్టెన్ గా ముగిసిన కోహ్లీ ఇన్నింగ్స్
  • ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టీకరణ
  • చివరివరకు ఆర్సీబీతోనే అని వెల్లడి
Virat Kohli clarifies on his future stint with RCB in IPL

ఐపీఎల్ లో ట్రోఫీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన విరాట్ కోహ్లీకి ఆశాభంగం అయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై కోల్ కతా విజయం సాధించడమే అందుకు కారణం. దాంతో కోహ్లీకి కెప్టెన్ గా చివరి ఐపీఎల్ సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో తన భవితవ్యంపై కోహ్లీ స్పష్టతనిచ్చాడు.

మరో జట్టులో ఆడడాన్ని తాను ఊహించుకోలేనని, తాను ఐపీఎల్ లో ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని స్పష్టం చేశాడు. విధేయుడైన ఆటగాడిగా ఉండడాన్ని ఇష్టపడతానని, ఐపీఎల్ లో తన చివరిరోజు వరకు ఆర్సీబీ జట్టుతోనే అని వివరించాడు. ఇప్పటివరకు కెప్టెన్ గా సర్వశక్తులు ధారపోశానని, ఇకపై ఆటగాడిగానూ అదే రీతిలో కృషి చేస్తానని కోహ్లీ పేర్కొన్నాడు.

అసలు, నిన్నటి మ్యాచ్ లో ఇలాంటి ఫలితాన్ని తాము అస్సలు కోరుకోలేదని విచారం వ్యక్తం చేశాడు. అయితే టోర్నీ ఆసాంతం తమ కుర్రాళ్లు చూపిన పట్టుదల పట్ల గర్విస్తున్నానని తెలిపాడు. నిరాశ కలిగించే ముగింపు లభించినా, మేం తలలు ఎత్తుకునే ప్రదర్శన చేశామనే భావిస్తామని వివరించాడు. ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులకు, జట్టు యాజమాన్యానికి, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు అంటూ స్పందించాడు.

More Telugu News