RCB: ఐపీఎల్ ఎలిమినేటర్ ప్రారంభం... బెంగళూరు వర్సెస్ కోల్ కతా... ఓడిన జట్టు ఇంటికే!

  • షార్జాలో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • భారీ స్కోరుపై కన్నేసిన కోహ్లీ సేన
  • ఇరు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు
RCB plays against KKR in IPL Eliminator

ఐపీఎల్ టోర్నీలో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టు ఇంటికేనన్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు చావోరేవో పోరుకు సిద్ధమయ్యాయి. షార్జాలో జరిగే ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ప్రత్యర్థి ముందు భారీ స్కోరు నిర్దేశించాలని ఆర్సీబీ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే దేవదత్ పడిక్కల్, కోహ్లీ, మ్యాక్స్ వెల్, ఏబీ డివిలియర్స్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. వీరికితోడు చిచ్చరపిడుగులా చెలరేగుతున్న తెలుగుతేజం శ్రీకర్ భరత్ ఉండనే ఉన్నాడు. గత మ్యాచ్ లో భరత్ చివరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించడం తెలిసిందే. బౌలింగ్ లో హర్షల్ పటేల్ ప్రధాన అస్త్రంగా ఎదిగాడు. సిరాజ్, చాహల్ కూడా విజృంభిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. నేటి మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

అటు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులోనూ మార్పులు లేవు. లీగ్ దశలో ఉత్తమ ఆటతీరులో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన కోల్ కతా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కు తోడు కొత్త కెరటం వెంకటేశ్ అయ్యర్ విజృంభిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్ లో నితీశ్ రాణా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్ కూడా రాణిస్తే కోల్ కతాను అడ్డుకోవడం ఏమంత సులువు కాదు.

కోల్ కతా బౌలింగ్ లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. లాకీ ఫెర్గుసన్ పేస్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ అనేక మ్యాచ్ లలో కోల్ కతాకు విజయాలు అందించింది. కాగా, నేటి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది.

More Telugu News