పోలింగ్ బూత్‌లో మంచు మోహ‌న్ బాబు ఆగ్ర‌హం.. శివబాలాజీ, హేమల మధ్య కూడా వాగ్వివాదం

10-10-2021 Sun 10:18
  • కొన‌సాగుతోన్న ఎన్నిక‌లు
  • పోలింగ్ బూత్‌లో ప్ర‌చారం చేస్తున్నారంటూ మోహ‌న్ బాబు ఆగ్ర‌హం
  • సమీర్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు
mohan babu fires on panel

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పోలింగ్ కొన‌సాగుతోంది. అయితే, పోలింగ్ జ‌రుగుతోన్న హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ వ‌ద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ సినీన‌టుడు మోహన్ బాబు పోలింగ్‌ బూత్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం. కొందరు ప్యానెల్‌ సభ్యులు లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న మండిప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. సమీర్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.  

కావాలంటే గేటు బయటే ప్రచారం చేసుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు కూడా ప‌ర‌స్ప‌రం వ్యాఖ్య‌లు చేసుకున్నారు. మ‌రోవైపు, శివబాలాజీ, హేమల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా,  ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సుమన్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికల అధ్యక్ష బరిలో మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని చెప్పారు.  ఏపీలో షూటింగ్స్ కోసం  ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయాలని ఆయ‌న అన్నారు. తెలంగాణలో చిన్న నిర్మాతల కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వం ఫిల్మ్‌సిటీ నిర్మించాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.