చనిపోయిన తల్లి తిరిగి బతుకుతుందని.. రెండు రోజులుగా శవం వద్ద కుమార్తెల పూజలు

10-10-2021 Sun 09:39
  • తమిళనాడులోని తిరుచ్చిలో ఘటన
  • శవం వద్ద బిగ్గరగా ప్రార్థనలు
  • పోలీసులను లోపలికి రాకుండా అడ్డుకున్న కుమార్తెలు
  • పూజలు చేస్తే బతుకుతుందంటూ వాగ్వివాదం
Daughters pray over mothers body hoping for return to life in Tamil Nadu
చనిపోయిన తల్లి తిరిగి బతుకుతుందన్న నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద రెండు రోజులుగా కుమార్తెలు పూజలు చేస్తున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో వెలుగుచూసింది.. పోలీసుల కథనం ప్రకారం.. మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) భర్త 20 ఏళ్ల క్రితమే మరణించారు. అవివాహితులైన కుమార్తెలు జయంతి (43), జెసిందా (40)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఇంటి నుంచి పెద్దగా పూజలు చేస్తున్నశబ్దాలు వినిపిస్తుండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయిందని, ఆమె బతుకుతుందన్న ఉద్దేశంతో మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తొలుత పోలీసులను ఇంట్లోకి రాకుండా వారు అడ్డుకున్నారు. తమ తల్లి మరణించలేదని, ఆమెను చంపాలని చూడొద్దంటూ వారితో గొడవకు దిగారు. మేరీ మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. ప్రార్థనలు చేస్తే తమ తల్లి బతుకుతుందని చెప్పారు. చివరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ కూడా వైద్యులతో వారు గొడవకు దిగారు.