'మా' ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు ఎంతో కష్టంగా ఉంది: మోహన్ బాబు ఆడియో సందేశం

09-10-2021 Sat 15:43
  • రేపు 'మా' ఎన్నికల పోలింగ్
  • హోరాహోరీ పోరు.. సర్వత్ర ఆసక్తి
  • ప్రచారం ముమ్మరం చేసిన విష్ణు, ప్రకాశ్ రాజ్
  • విష్ణుకు ఓటేయాలని మోహన్ బాబు విజ్ఞప్తి
Mohan Babu voice message to MAA members ahead of elections
రేపు 'మా' ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మా సభ్యులకు మోహన్ బాబు ఆడియో సందేశం పంపారు. నాడు తెలుగు కళాకారులు ఒకటిగా ఉండాలనే 'మా' ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఎన్నికలతో పనిలేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సినీ పెద్దలు భావించేవారని పేర్కొన్నారు. అయితే కొందరు 'మా' సభ్యులు అనవసరంగా నవ్వులపాలవుతున్నారని వివరించారు. 'మా' ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు ఎంతో బాధ కలుగుతోందని తెలిపారు. ఎవరు ఎలాగున్నా, ఎవరు ఏం చేసినా 'మా' ఓ కుటుంబం అని మోహన్ బాబు స్పష్టం చేశారు.

"విష్ణును మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఓటేయండి. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించండి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని విష్ణు నెరవేర్చుతాడని నమ్ముతున్నాను. విష్ణు విజయం సాధించాక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలను వారికి విన్నవించుకుందాం" అని పేర్కొన్నారు.