Facebook: వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య.. రెండు గంటల పాటు అంతరాయం

  • ప్రపంచంలోని చాలా దేశాల్లో యూజర్లకు ఇబ్బందులు
  • రెండు గంటల పాటు సేవలకు అంతరాయం
  • క్షమాపణలు కోరిన ఫేస్ బుక్
Facebook and Whatsapp Faces Same Issue Again Stopped For Hours

వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు మళ్లీ ఆగిపోయాయి. రెండు గంటల పాటు సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం కాన్ఫిగరేషన్  సమస్యతో ఆరేడు గంటల పాటు ఆ మూడు ఆగిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మళ్లీ అదే సమస్యతో ఆ మూడు చాలా సేపు ఆగాయి.

ప్రపంచంలోని చాలా దేశాల్లో సమస్య తలెత్తినట్టు సోషల్ మీడియా సైట్ల అంతరాయంపై కథనాలు రాసే డౌన్ డిటెక్టర్ అనే సంస్థ వెల్లడించింది. ఫేస్ బుక్, ఇన్ స్టాలో యూజర్లు పోస్టులు పెట్టలేకపోయారని, మెసెంజర్, వాట్సాప్ నుంచి మెసేజ్ లను పంపించుకోలేకపోయారని తెలిపింది. వారంలో ఇది రెండో సారి కావడంతో వినియోగదారులు ట్విట్టర్ లో తమ అసహనాన్ని వెలిబుచ్చారు.

కాగా, అంతరాయం పట్ల ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోని చాలా మంది యూజర్లకు సమస్య తలెత్తిన విషయం తెలిసిందని, మళ్లీ యథాస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ఆ తర్వాత రెండు గంటలకు సేవలను పునరుద్ధరించామని తెలిపింది.

తమ సేవలను నమ్ముకున్న వారు రెండు గంటలుగా ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోగలమని, అందుకు క్షమించాలని కోరింది. సమస్యను పరిష్కరించామని, ఇప్పుడంతా మామూలుగానే ఉందని ఇన్ స్టాగ్రామ్ తెలిపింది. ఈ వారంలో రెండోసారి సహనంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపిన ఇన్ స్టా.. ‘మీమ్స్ పెట్టినవారికి కూడా’ అంటూ కామెంట్ చేసింది.

More Telugu News