'సలార్' దర్శకుడితో ప్రభాస్ మరో ప్రాజక్ట్?

08-10-2021 Fri 16:41
  • వివిధ భాషల దర్శకులతో ప్రభాస్  
  • పోస్ట్ ప్రొడక్షన్ దశలో 'రాధే శ్యామ్'
  • సిద్ధార్థ్ ఆనంద్ తో భారీ ప్రాజక్ట్  
  • ప్రశాంత్ నీల్ తో ఇప్పటికే 'సలార్'
Prabhas to do another project with Prashanth Neil

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోవడంతో ఆయన నటించే ప్రతి సినిమా అభిమానులలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఆయన నుంచి ఒక కొత్త సినిమా ప్రకటన వస్తోందంటే అందరిలోనూ ఎంతో కుతూహలం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఇటు తెలుగు దర్శకులతో పాటు హిందీ, కన్నడ రంగాలకు చెందిన వివిధ దర్శకులతో ఆయన తన కొత్త సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.

తాజాగా తను నటించిన 'రాధే శ్యామ్' పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ విడుదలకు రెడీ అవుతోంది. మరోపక్క, ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చిత్రాలు చేస్తున్నాడు. ఇంకోపక్క నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయి సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఇటీవలే తన 25వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' పేరుతో ఇది తెరకెక్కుతుంది.

ఇదిలావుంచితే, త్వరలో ప్రభాస్ మరో రెండు కొత్త చిత్రాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఒకటి బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. మరొక చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ తో ప్రభాస్ 'సలార్' చిత్రాన్ని చేస్తున్నాడు. అది ఇంకా ప్రొడక్షన్లో వుండగానే, తనితో మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించడం విశేషమనే చెప్పాలి. అంటే ప్రశాంత్ మేకింగ్ స్టయిల్ బాగా నచ్చడం వల్లే అతనితో ఇంత త్వరగా మరో చిత్రాన్ని చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పాడని అంటున్నారు.