Supreme Court: లఖింపూర్ కేసు: యూపీ సర్కారు తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

Supreme Court once again questions Uttar Pradesh govt on Lakhimpur issue
  • అక్టోబరు 3న ఘటన
  • లఖింపూర్ లో నలుగురు రైతుల సహా 8 మంది మృతి
  • కారును వేగంగా పోనిచ్చిన ఆశిష్ మిశ్రా
  • కేంద్రమంత్రి తనయుడ్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయని పోలీసులు
లఖింపూర్ లో రైతుల మరణం కేసులో యూపీ సర్కారు వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

"సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసులు వెంటనే స్పందించకుండా, నిందితులను అదుపులోకి తీసుకోకుండా ఏం సందేశాన్ని అందించాలనుకుంటున్నారు. ఈ కేసులో నిందితులపై 302 సెక్షన్ మోపబడింది. ఇది హత్యకు సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ పై నమోదయ్యే ఇతర కేసుల్లో వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో లఖింపూర్ కేసు నిందితులతోనూ అలాగే వ్యవహరించండి" అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.

కాగా, రైతుల మరణానికి కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు నిన్న యూపీ పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించారు. అయితే ఇంతవరకు ఆశిష్ మిశ్రా పోలీసుల ఎదుట హాజరుకాలేదు. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని వెల్లడించింది. ఆశిష్ మిశ్రా, మరికొందరికి లఖింపూర్ నరమేధంలో భాగం ఉందని, వీరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.

లఖింపూర్ లో అక్టోబరు 3న జరిగిన ఘటనలతో నలుగురు రైతుల సహా మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా రైతులపైకి పోనిచ్చి వారి మరణానికి కారకుడయ్యాడన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం.
Supreme Court
Lakhimpur
Uttar Pradesh
Ashish Mishra
Ajay Mishra
Farmers
Death
Police

More Telugu News