Gujarat: జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి ముంద్రా పోర్టులో పట్టుబడిన నార్కోటిక్స్ కేసు

  • గతనెల 15న ముంద్రాపోర్టులో పట్టుబడిన డ్రగ్స్
  • విజయవాడ చిరునామాతో రవాణా
  • కేంద్రం నిర్ణయంతో డీఆర్ఐ నుంచి కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
  • మాచవరం సుధాకర్‌‌ను పాత్రధారిగా నిర్దారించిన దర్యాప్తు సంస్థలు
Mundra Port Drug Case Investigation Handed Over To NIA

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడిన డ్రగ్స్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్న డీఆర్ఐ నుంచి ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అంతర్జాతీయ మూలాలు ఉండడమే కేంద్రం నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

గత నెల 15న ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడింది. విజయవాడ చిరునామాతో ఇది రవాణా అవుతుండడం సంచలనమైంది. ఈ మొత్తం వ్యవహారం వెనక తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ పాత్రధారి కాగా, డ్రగ్ మాఫియా కింగ్‌పిన్‌ను ఢిల్లీ వాసిగా అనుమానిస్తున్నారు.

నిజానికీ డ్రగ్స్‌ను ఢిల్లీకి చేర్చాలన్నది లక్ష్యమని, అయితే నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టి మరల్చేందుకు విజయవాడ అడ్రస్ ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుధాకర్ పాత్రధారిగా మారాడని, తన భార్య పేరిటే ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి దానిని డ్రగ్స్ ముఠాకు అందించాడని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇప్పుడీ కేసు ఎన్ఐఏ చేతికి అందడంతో దర్యాప్తు వేగం పుంజుకోనుంది.

More Telugu News