Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు అనుమానంగా ఉంది: సజ్జల

  • చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదన్న సజ్జల
  • తన డబ్బును డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారని వ్యాఖ్యలు
  • లోకేశ్ కు ఇప్పుడు దుబాయ్ లో ఏంపని అంటూ నిలదీత
  • సీబీఐ, డీఆర్ఐ నిగ్గుతేల్చాలని డిమాండ్
Sajjala allegations on Chandrababu and Lokesh

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు కుటుంబమే డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. లోకేశ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడని, ఈ సమయంలో అతడికి దుబాయ్ లో ఏంపని? అని ప్రశ్నించారు. లోకేశ్ పర్యటన అనుమానాస్పదంగా ఉందని అన్నారు.

చంద్రబాబు కూడా మాల్దీవులు, మారిషస్, సింగపూర్, హాంకాంగ్ వెళుతుంటాడని, చంద్రబాబు తాను సంపాదించిన సొమ్మును డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయంగా భవిష్యత్తు లేకపోవడంతో డ్రగ్స్ దందా ఎంచుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీబీఐ, డీఆర్ఐ వంటి దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాలని సజ్జల డిమాండ్ చేశారు.

ఇంకోసారి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ అగ్రనేతలను హెచ్చరించారు. ఎక్కడో ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరికితే సినిమా డైరెక్టర్ల తరహాలో కథలు అల్లుతున్నారని మండిపడ్డారు.

More Telugu News