Power: కరెంట్ కు కష్టాలే.. దేశంలో బొగ్గు సంక్షోభం.. మరో ఆరు నెలలు ఉండొచ్చన్న కేంద్ర మంత్రి!

  • చాలా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొరత
  • ఒక్కో ప్లాంట్ కు 80 వేల టన్నుల వరకు కొరత
  • రాబోయే రోజుల్లో చార్జీలు పెరిగే అవకాశం
  • కరెంట్ కోతలపై సగానికిపైగా సంస్థల అలర్ట్
On the Verge Of Power Crisis Coal Only For Four Days Across All Thermal Power Plants

దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్ లో 70 శాతం వాటా బొగ్గు నుంచి ఉత్పత్తవుతున్నదే. అయితే, ఇప్పుడు దేశంలో కరెంట్ సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం, ఆ కరెంట్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు నిల్వలు అడుగంటిపోవడమే. అవును, గత నెల చివర్లో దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయి మరి. ఆగస్టులో అయితే 13 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇప్పటికే సగానికిపైగా కేంద్రాలు విద్యుత్ కోతలకు సంబంధించిన అలర్ట్ ను జారీ చేశాయి. మరోవైపు ఈ సంక్షోభం మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

చైనాలాగానే భారత్ ముందు కూడా ప్రస్తుతం రెండు సవాళ్లున్నాయి. ఒకటి కరోనా తర్వాత పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిపోవడం, రెండోది పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు ఎప్పటికప్పుడు పడిపోతున్న బొగ్గు నిల్వలకుతోడు సరైన సరఫరా లేకపోవడం. వాస్తవానికి మన బొగ్గు అవసరాల్లో ఎక్కువ భాగం మన దేశం నుంచే సరఫరా అవుతుంటుంది. కానీ, ఇటీవలి భారీ వర్షాలకు దేశంలోని గనులన్నింటిలోకి వరద చేరి బొగ్గు తవ్వకం కష్టమైపోయింది. ఇటు రవాణా మార్గాలూ మూసుకుపోయాయి.

దీంతో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్వాహకులు అతిపెద్ద డైలమాలో పడిపోయారు. ఎక్కడ దొరికితే అక్కడ వేలం పాడుకుని ఎక్కువ ధరకు బొగ్గును తీసుకురావడమా? లేక వేరే దేశాల నుంచి సముద్ర మార్గాల్లో దిగుమతి చేసుకున్న బొగ్గును కొనడమా? అనే ఆందోళనలో ఉన్నారు. అయితే, దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఇప్పటికే ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దానివైపు మొగ్గు చూపే అవకాశాల్లేవని నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల కరెంట్ కోతలు తప్పేలా లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని ప్రభావం కొన్ని నెలల్లోనే వినియోగదారులపై పడుతుందని క్రెడిట్ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ మాస్టర్ చెప్పారు. త్వరలో విద్యుత్ ధరలు పెరిగే ముప్పూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద ఉన్న బొగ్గు నిల్వలు 81 లక్షల టన్నులకు తగ్గిపోయాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 76 శాతం తక్కువ. ప్రస్తుతం అవి 60 వేల నుంచి 80 వేల టన్నుల కొరతతో ఒక్కో ప్లాంట్ నడుస్తోందని చెబుతున్నారు.  

ఈ సంక్షోభం నాలుగు నుంచి ఐదు నెలలు, లేదంటే ఐదు నుంచి ఆరు నెలలుండే అవకాశం ఉంటుందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండడంతో డిమాండ్ కొంత తక్కువగా ఉందని, అక్టోబర్ మధ్య నాటికి గానీ ఏమీ చెప్పలేమని అన్నారు. దేశంలో అత్యంత ఎక్కువ విద్యుదుత్పత్తిని చేసే ఎన్టీపీసీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్ తో చర్చలు జరుపుతున్నామన్నారు.

More Telugu News