అగ్రస్థానం నీదా, నాదా... ఐపీఎల్ లో నేడు కీలక సమరం

04-10-2021 Mon 19:33
  • ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ ఢిల్లీ
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్
  • పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో ఉన్న చెన్నై, ఢిల్లీ
Table toppers CSK and DC plays in Dubai

ఐపీఎల్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ప్రవేశించాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన చెన్నై 9 విజయాలు 3 ఓటములతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఢిల్లీ జట్టు కూడా 12 మ్యాచ్ ల్లో 9 విజయాలు, 3 ఓటములు నమోదు చేసినప్పటికీ చెన్నై కంటే తక్కువ రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ జట్టు అగ్రస్థానంలోకి వెళ్లనుంది.

ఇక దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ విషయానికొస్తే... టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు స్టీవ్ స్మిత్ ను తప్పించి, కొత్త కుర్రాడు రిపల్ పటేల్ ను తుదిజట్టులోకి తీసుకుంది. చెన్నై జట్టులో శామ్ కరన్ స్థానంలో డ్వేన్ బ్రావో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆసిఫ్ స్థానంలో దీపక్ చహర్, సురేశ్ రైనా స్థానంలో రాబిన్ ఊతప్పను తీసుకున్నామని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు.