Naresh: 'మా' కోసం ఇంతకంటే గొప్పగా చేశామని చెప్పమనండి... నేను జీవితంలో పోటీ చేయను: నరేశ్

  • ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నరేశ్ వ్యాఖ్యలు
  • మా అధ్యక్షుడిగా అనేక మంచి పనులు చేశానని వెల్లడి
  • ప్రముఖులు తనను మెచ్చుకున్నారని వెల్లడి
  • జీవిత వ్యవహారంలో వివరణ
Naresh responds to allegations

మా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవీకాలంలో అనేక మంచి పనులు చేశానని, చరిత్రలో ఇదొక అద్భుతమైన టర్మ్ అని మోహన్ బాబు కూడా మెచ్చుకున్నారని వివరించారు. సర్వసభ్య సమావేశంలో మురళీమోహన్ గారు కూడా కొనియాడారని వెల్లడించారు. నువ్వు కరోనా సంక్షోభ సమయంలో అమోఘమైన పనితీరు కనబరిచావు అంటూ చిరంజీవి సైతం తనను ప్రశంసించారని నరేశ్ చెప్పుకొచ్చారు.

ఈ పాతికేళ్ల చరిత్రలో ఇంతకంటే గొప్పగా ఇంకెవరైనా చేశారా అని సవాల్ విసిరారు. ఎవరైనా ఇంతకంటే మెరుగ్గా చేశామని చెబితే నేను జీవితంలో మా ఎన్నికల్లో పోటీ చేయను అని నరేశ్ స్పష్టం చేశారు. రూ.1.20 కోట్లతో 911 మంది ప్రాణాలను కాపాడామని, నర్సింగ్ యాదవ్, వేణుమాధవ్ సహా 16 కుటుంబాలకు రూ.3 లక్షల సాయం అందించామని, ఆయా నటులు మరణించిన 24 గంటల్లోపే వారి కుటుంబాలకు సాయం అందించామని, ఇది అవాస్తవమని ఎవరైనా చెప్పగలరా? అని నిలదీశారు.

"జనరల్ సెక్రటరీ పనులు కూడా మేమే చేయాల్సి వచ్చింది. పాపం... జీవిత గారిపై ఎంతో భారం ఉంది. ఇద్దరు కూతుళ్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె భర్త సినిమాలు చేస్తున్నారు. ఇన్ని పనులతో ఆమె మా వ్యవహారాలు చూసుకోవడం అయ్యే పని కాదని భావించి, అన్ని పనులు శివబాలాజీ, రాజీవ్ కనకాలే చూసుకున్నారు. అమ్మా... నువ్వు ఎంతవరకు వీలైతే అంతవరకే మా వ్యవహారాలు చూసుకో... నీకు వీలుకాకపోతే మేం చూసుకుంటాం అని జీవితతో చెప్పాం" అంటూ నరేశ్ వివరించారు.

More Telugu News