World Bank: ప్రపంచ బ్యాంకులో అవకతవకలు... దేశాల ఆర్థిక ర్యాంకుల తారుమారు!

  • దేశాలకు ర్యాంకులు కేటాయిస్తున్న ప్రపంచబ్యాంకు
  • గత కొంతకాలంగా చైనాకు మెరుగైన ర్యాంకు
  • చైనాకు అనుకూలంగా ర్యాంకు మార్పు
  • న్యాయసేవల సంస్థతో విచారణ 
  • అక్రమాలు నిజమేనని తేలిన వైనం
Ranking irregularities in World Bank

ప్రపంచబ్యాంకు... అనేక బడుగు దేశాలకు, మధ్య శ్రేణి దేశాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న అంతర్జాతీయ సంస్థ. అలాంటి సంస్థలోనూ అక్రమాలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు దేశాల ఆర్థిక స్థితిగతులను మదింపు చేసి ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగానే ఆయా దేశాలతో వాణిజ్య సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఎంత మెరుగైన ర్యాంకు ఉంటే అంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతుంటారు.

సరిగ్గా, ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని ప్రపంచబ్యాంకులో అవకతవకలు జరిగాయి. కొన్ని దేశాలకు అనుకూలంగా ర్యాంకులు కేటాయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా, ఓ న్యాయసేవల సంస్థతో ప్రపంచ బ్యాంకు విచారణ జరిపించింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. అక్రమాలు నిజమేనని ఆ న్యాయసేవల సంస్థ నిగ్గుతేల్చింది.

చైనాకు 2018లో వచ్చిన ర్యాంకు 78. అయితే, న్యాయసేవల సంస్థల విచారణలో తేలిందేమిటంటే... చైనాకు అంతకంటే తక్కువస్థాయి ర్యాంకు రావాల్సి ఉంది. కానీ ప్రపంచబ్యాంకు మేనేజ్ మెంట్ బోర్డులోని కొందరు కీలక వ్యక్తులు ర్యాంకులు తారుమారు చేసినట్టు విచారణలో గుర్తించారు.

ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎండీగా ఉన్న క్రిస్టలీనా జార్జియేవా అప్పట్లో ప్రపంచబ్యాంకు సీఈవోగా వ్యవహరించారు. దాంతో ఆమెపై సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అయితే, తనకే పాపం తెలియదని క్రిస్టలీనా అంటున్నారు. కానీ ఐఎంఎఫ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం జరిపి ఆమెను ఎండీగా కొనసాగించే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

2018లోనే కాదు, 2020లోనూ ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ముఖ్యంగా చైనా, అజర్ బైజాన్, సౌదీ అరేబియా వంటి దేశాల ర్యాంకులు వాస్తవపరిస్థితులను ప్రతిబింబించేలా లేవని విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

చైనా నుంచి గణనీయమైన స్థాయిలో వనరులు రాబట్టేందుకే, ఆ దేశానికి మెరుగైన ర్యాంకును కేటాయించారన్న ఆరోపణలు నిజమేనని ఆ సంస్థ తేల్చింది. ఈ వ్యవహారం చివరికి ఏ పరిణామానికి దారితీస్తుందోనని ప్రపంచ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News