నాగచైతన్య, సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

03-10-2021 Sun 11:44
  • బాలీవుడ్ విడాకుల నిపుణుడే కారణమంటూ వ్యాఖ్య
  • విడాకుల్లో మగాడిదే తప్పని కామెంట్
  • ఇలాంటి వారి పట్ల దయన్నదే చూపకూడదని మండిపాటు
Kangana Ranaut Sensational Comments On Chay Sam Divorce

ఎన్నో ఊహాగానాల మధ్య అక్కినేని నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలో సమంత ఇంటిపేరు ‘అక్కినేని’ని తొలగించడం, ఆ తర్వాత మీడియాలో వారు విడిపోతున్నారంటూ కథనాలు రావడం జరిగిపోయాయి. అయితే, తాము విడిపోవట్లేదని, మీడియా కథనాలను పట్టించుకోబోమని వారు చెప్పారు. తాజాగా నిన్న విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు.

దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లోని ‘విడాకుల ఎక్స్ పర్ట్’ వల్లే వారిద్దరూ విడిపోయారని చెప్పింది. వారి పేర్లను ప్రస్తావించకుండా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ఆమిర్ ఖాన్ ను ‘బాలీవుడ్ విడాకుల నిపుణుడు’ అంటూ పరోక్షంగా విమర్శించింది.

ఇంతకుముందెన్నడూ లేనంతగా విడాకుల సంస్కృతి భారీగా పెరిగిపోతోందని కామెంట్ చేసింది.  ‘‘విడాకులు జరిగితే దానికి మగాడిదే తప్పు. వింతగా అనిపించినా దేవుడు మగాడిని, ఆడదాన్ని అలాగే తయారు చేశాడు. మగాడు వేటగాడైతే.. స్త్రీ ఇంటి సంరక్షకురాలు. దుస్తులు మార్చినంత సులువుగా భార్యలను మార్చేసి మంచి స్నేహితులమని చెప్పే ఇలాంటి చెత్త మగాళ్ల పట్ల అస్సలు దయ చూపించకూడదు’’ అని రాసుకొచ్చింది.

ఇలాంటి మగవారిని ఎంకరేజ్ చేసే మీడియా, అభిమానులకు సిగ్గులేదని మండిపడింది. విడాకులు ఇచ్చిన మగవారిని పొగిడి.. కేవలం మహిళలపై అభాండాలు వేస్తుంటారని వ్యాఖ్యానించింది. ‘‘విడాకులు తీసుకున్న ఈ దక్షిణాది నటుడు.. పదేళ్లపాటు ప్రేమలో ఉండి.. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడు విడిపోయాడు. ఎంతోమంది ఆడవారి జీవితాలతో ఆడుకున్న ‘విడాకుల నిపుణుడు’ అయిన ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను ఆ నటుడు ఇటీవలే కలిశాడు. ఆ విడాకుల నిపుణుడే అతడికి గైడ్ గా మారాడు. ఆ తర్వాత కథంతా సాఫీగా సాగిపోయింది. నేనేమీ గుడ్డిగా ఈ మాట అనట్లేదు’’ అని పేర్కొంది. చివరిగా తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైందనుకుంటా అంటూ ముగించింది.