Somireddy Chandra Mohan Reddy: వైసీపీ అరాచకాలకు రెడ్లు కూడా బలవుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం: సోమిరెడ్డి

Somireddy agrees with Pawan Kalyan comments
  • రాజమండ్రిలో పవన్ శ్రమదానం
  • వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు
  • పవన్ వ్యాఖ్యలను సమర్థించిన సోమిరెడ్డి
  • ఏపీ నిండా జగన్ బాధితులేనని ఆరోపణ  
రాజమండ్రి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో రెడ్లు కూడా సతమతమవుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయం అక్షరసత్యం అని పేర్కొన్నారు.

ఎన్నో ఆశలతో జగన్ ను నెత్తిన పెట్టుకున్న రెడ్లు ఇప్పుడు బాధపడుతున్నారని సోమిరెడ్డి వెల్లడించారు. జగన్ అరాచక పాలనతో తమ సామాజిక వర్గం భ్రష్టుపట్టిపోయిందని ఆవేదన చెందుతున్నారని వివరించారు. అధికారంలోకి వచ్చాక భజనపరులకు పదవులు కట్టబెట్టడం తప్ప జగన్ ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. యథేచ్ఛగా కొనసాగుతున్న అకృత్యాలకు ఎంతోమంది రెడ్లు బలైపోతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలతో పాటు అగ్రవర్ణాల వారు కూడా వైసీపీ నేతల దుర్మార్గాలతో నష్టపోతున్నారని వివరించారు. కులంతో సంబంధం లేకుండా ఏపీ మొత్తం జగన్ బాధితులతో నిండిపోతోందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టు రెడ్లకు ఈ అరాచకాల నుంచి మినహాయింపు లేదని పేర్కొన్నారు.
Somireddy Chandra Mohan Reddy
Pawan Kalyan
Rajahmundry
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News