ఇంటింటికీ మూడు చెత్త డబ్బాలు.. ‘స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభించిన సీఎం జగన్

02-10-2021 Sat 11:55
  • తడి, పొడి, ప్రమాదకర చెత్తలకు వేర్వేరు బిన్ లు
  • రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్ బిన్ లు
  • 4,097 స్వచ్ఛ వాహనాల ప్రారంభం
  • 100 రోజుల పాటు కార్యక్రమం నిర్వహణ
CM YS Jagan Launches Clean Andhrapradesh Clap In Vijayawada

క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సంకల్పం సీడీలను ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి 4,097 స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. 100 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాల కోసం ఇంటింటికీ మూడు చెత్త డబ్బాలను పంపిణీ చేయనున్నారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల బిన్ లను పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్ బిన్ లను ప్రజలకు అందించనున్నారు.


ఇప్పటికే గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే 10,645 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అదనంగా మరో 4,171 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పంచాయతీలకు 14 వేల వాహనాలను అందించింది. మేజర్ పంచాయతీల్లో వెయ్యి ఆటోలను అందుబాటులో ఉంచింది. నగరాలు, పట్టణాలకు 3,097 ఆటోలు, 1,800 విద్యుత్ వాహనాలను పంపిణీ చేసింది.