Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.. ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావన్న ధర్మాసనం

  • కోడెల వర్ధంతి సభలో జగన్, హోంమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేసు
  • ఒకే ఘటనపై వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు కుదరవన్న ధర్మాసనం
  • ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా జరిపే దర్యాప్తును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
AP High Court ruled that the sections registered against Ayyanna patrudu were invalid

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సెప్టెంబరు 18న కొత్తపల్లి ప్రసాద్ అనే వ్యక్తి నకరికల్లు పోలీసులకు అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, విపత్తుల నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే, తనపై మోపిన కేసులను కొట్టివేయాలంటూ అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ  పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హోంమంత్రిని ఉద్దేశించి పిటిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవని అన్నారు.

అలాగే, విపత్తు నిర్వహణ చట్టం కింద ఫిర్యాదు చేసే అధికారం కూడా ఫిర్యాదుదారుడికి లేదన్నారు. ఇదే ఘటనకు సంబంధించి అదే పోలీస్ స్టేషన్‌లో ఇది వరకే ఐపీసీ 504, 505 కింద ఎఫ్ఐఆర్ నమోదై ఉందని, కాబట్టి ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా దర్యాప్తు అవసరం లేదని అన్నారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. ఒకే ఘటనపై బహుళ ఎఫ్ఐఆర్‌లు సరికాదని సుప్రీంకోర్టు ఇది వరకే చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా జరిపే దర్యాప్తును నిలిపివేసి, విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News