రేపు 'రిపబ్లిక్' రిలీజ్... సాయితేజ్ ఆరోగ్యంపై చిరంజీవి స్పష్టత

30-09-2021 Thu 18:07
  • సాయితేజ్ కోలుకుంటున్నాడన్న చిరంజీవి
  • 'రిపబ్లిక్' సక్సెస్ పై ధీమా
  • అతడికి ఆశీస్సులు అందించాలని పిలుపు
  • చిత్ర యూనిట్ కు బెస్టాఫ్ లక్ చెబుతూ ట్వీట్
Chiranjeevi statement on Saitej health

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రిపబ్లిక్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయితేజ్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. సాయితేజ్ త్వరగా కోలుకుంటున్నాడని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'రిపబ్లిక్' చిత్రం సక్సెస్ రూపంలో సాయితేజ్ కు అందరి ఆశీస్సులు అందుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

అంతేకాకుండా, కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ప్రదర్శన (ఎగ్జిబిటర్లు, థియేటర్లు) రంగం కోలుకోవడానికి 'రిపబ్లిక్' చిత్రం విజయం కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆకాంక్షిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా యూనిట్ కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఈ మేరకు ట్వీట్ చేశారు.