వ్యాక్సిన్ వేయించుకున్నా.. 30 మంది మెడికల్ స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్!

30-09-2021 Thu 17:59
  • ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో కరోనా కలకలం
  • 30 మందిలో 28 మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి
30 Mumbai Medical College Students Test Positive
ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరిలో 28 మంది విద్యార్థులు కరోనా టీకా వేయించుకోవడం గమనార్హం. కరోనా బారిన పడిన వారిలో 23 మంది ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతుండగా... మిగిలిన ఏడుగురు తొలి సంవత్సరం చదువుతున్నారు. వీరిలో ఒక విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు క్వారంటైన్ లో ఉన్నారు.


ఈ కాలేజీలో మొత్తం 1100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. 30 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇతర విద్యార్థులకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 200 నుంచి 250 మందికి పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఈ వారంలో బెంగళూరులోని ఒక రెసిడెన్సియల్ పాఠశాలలో 60 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో, అక్టోబర్ 20 వరకు స్కూల్ ను మూసేశారు.