Posani Krishna Murali: పోసాని ఇంటిపై అర్ధరాత్రి దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు

Posani Krishna Murali house attacked by unknown persons
  • యల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాళ్లు రువ్విన వైనం
  • ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వాచ్ మెన్
  • ఎనిమిది నెలల క్రితమే గచ్చిబౌలికి మకాం మార్చిన పోసాని
జనసేనాని పవన్ కల్యాణ్ పై సినీ నటుడు పోసాని కృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ ను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలోని యల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు, ఇటుకలు రువ్వారు. ఏడు, ఎనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడి సందర్భంగా పోసానికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినదించినట్టు కూడా తెలుస్తోంది.

మరోవైపు, ఘటన సమయంలో ఇంటి వద్ద వాచ్ మెన్, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన వాచ్ మెన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరోవైపు పోసాని 8 నెలల క్రితం యల్లారెడ్డిగూడలోని ఇంటి నుంచి గచ్చిబౌలికి మారారు. అయితే, యల్లారెడ్డిగూడలోని ఇంట్లో పోసాని ఉంటున్నారని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. ఆయన ఈ ఇంట్లోనే ఉన్నారనే భావనతో దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Posani Krishna Murali
Tollywood
Home
Attack
Pawan Kalyan
Janasena

More Telugu News