New Delhi: చీరకట్టుకున్న వారికి అనుమతి లేదన్న ఢిల్లీ రెస్టారెంట్ మూసివేత

The Restaurant Which Denied Entry Saree Clad Woman Is Shut
  • ఓ మహిళను బయటకు పంపించిన ఢిల్లీ రెస్టారెంట్
  • యూట్యూబ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఈ నెల 24న మూసివేత నోటీసులిచ్చిన ఎస్డీఎంసీ
  • హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారుల గుర్తింపు
చీర కట్టుకున్న వారికి అనుమతి లేదంటూ ఓ మహిళను బయటకు పంపించేసిన రెస్టారెంట్ ను ఢిల్లీ ప్రభుత్వం మూసేసింది. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నారని, హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేదని పేర్కొంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) అధికారులు ఆ రెస్టారెంట్ కు మూసివేత నోటీసులను అందజేశారు.


కొన్ని రోజుల క్రితం ఆండ్రూస్ గంజ్ లోని అన్సల్ ప్లాజాలో నిర్వహిస్తున్న ఆక్విలా రెస్టారెంట్ కు చీర కట్టుకుని వచ్చిన మహిళను లోపలికి అనుమతించలేదు. హోటల్ మేనేజర్ ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఆ వీడియోను జర్నలిస్ట్ అయిన ఆ మహిళ యూట్యూబ్, ట్విట్టర్ లో పెట్టడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై మహిళా కమిషన్ కూడా స్పందించింది. రెస్టారెంట్ పై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికారులు తనిఖీలు చేశారు.

ఈ నెల 21న నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఆ రెస్టారెంట్ కు హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేదని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, అపరిశుభ్ర వాతావరణంలో హోటల్ ను నడుపుతున్నట్టు హెల్త్ ఇన్ స్పెక్టర్లు తేల్చారని ఎస్డీఎంసీ మేయర్ ముఖేశ్ సూర్యన్ తెలిపారు. ఈ నెల 24న మరోసారి వెళ్లి పరిశీలించినా రెస్టారెంట్ తీరులో మార్పు రాలేదని, దీంతో 48 గంటల్లోగా రెస్టారెంట్ ను మూసేయాలని ఆదేశిస్తూ అదేరోజు నోటీసులు జారీ చేశామని చెప్పారు.

దీనిపై స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యం.. వ్యాపారాన్ని బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. లైసెన్స్ లేకుండా హోటల్ ను నడుపబోమని స్పష్టం చేసింది.
New Delhi
Restaurant
Saree
Aquilla
SDMC

More Telugu News