Singam: డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సింగం’ సినిమా విలన్ మెల్విన్

Singam actor Chekwume Malvin arrested in Bengaluru for alleged drug peddling
  • బెంగళూరులోని హెచ్‌బీఆర్ లే అవుట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసుల చేతికి
  • రూ. 8 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం
  • కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమాల్లేక డ్రగ్స్ వ్యాపారంలోకి
కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘సింగం’ సినిమా చూసిన వారికి మెల్విన్ (45) గుర్తుండే ఉంటాడు. నైజీరియన్ అయిన చకువుమె మెల్విన్ విలన్‌గా నటించి మెప్పించాడు. తాజాగా, బెంగళూరులోని హెచ్‌బీఆర్ లే అవుట్ బీడీఏ కాంప్లెక్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు (సీసీబీ) నిన్న మెల్విన్‌ను అరెస్ట్ చేసి, అతడి నుంచి 250 గ్రాముల హషిష్ తైలం, 15 గ్రాముల ఎండీఎంఏ గుళికలు, ఫోన్, రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ. 8 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంతో సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎవరికైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

వైద్యం కోసం భారత్ వచ్చిన మెల్విన్ ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా నెగటివ్ పాత్రల్లోనే నటించాడు. అణ్ణబాండ్, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లోను, తమిళంలో విశ్వరూపం, సింగం వంటి సినిమాల్లోనూ నటించాడు.
Singam
Chekwume Malvin
Bengaluru

More Telugu News