నా మణికట్టుపై నాడి స్పర్శ ఉండదు.. వెల్లడించిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్

28-09-2021 Tue 20:42
  • కోన్ బనేగా కరోడ్‌పతి 13 కార్యక్రమంలో వెల్లడించిన ఆసక్తికర అంశం
  • అంతకు ముందు తన బ్లాగులో కూడా చెప్పిన ఘటన
  • ‘ఇంక్విలాబ్’ సినిమా సమయంలో ప్రమాదం
  • ఎడమచేతిలో చిచ్చుబుడ్డి పేలడంతో తీవ్రగాయాలు
Amitabh Bachchan Reveals His Pulse Cannot Be Felt On His Wrist
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఒక వింత విషయాన్ని వెల్లడించారు. అందరికీ మణికట్టుపై ఈజీగా దొరికే నాడి స్పర్శ, తనకు మాత్రం దొరకదని చెప్పారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 13 కార్యక్రమానికి అమితాబ్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్విజ్ పోటీలకు వచ్చిన పోటీదారులతో చాలా సరదాగా మాట్లాడే అమితాబ్ తాజా ఎపిసోడ్‌లో ఒక విషయం చెప్పారు. ఈ ఎపిసోడ్‌లో ‘సాధారణంగా హార్ట్ బీట్ తెలుసుకోవడానికి రెండు వేళ్లను శరీరంలో ఏ భాగంపై ఉంచి చూస్తారు?’ అనే ప్రశ్న వచ్చింది.

ఈ ప్రశ్నకు మణికట్టు సమాధానం. అయితే తన మణికట్టుపై వేళ్లు పెట్టినా నాడి దొరకదని బిగ్‌బీ చెప్పారు. 1984లో ‘ఇంక్విలాబ్’ చిత్రంలో నటిస్తుండగా తనకు జరిగిన ప్రమాదం గురించి బిగ్‌బీ వివరించారు. దీపావళి కావడంతో ఇంటికొచ్చిన తను టపాసులు పేల్చానని, ఆ సమయంలో ఒక చిచ్చుబుడ్డి తన ఎడమచేతిలో పేలిపోయిందని గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రమాదంలో ఎడమచెయ్యి బాగా దెబ్బతిందని చెప్పారు. అసలు అరచెయ్యి లేకుండా పోయిందని, ఒక మాంసం ముద్దలా తయారైందని వివరించారు. ఢిల్లీ ఆస్పత్రిలో చేరితే డాక్టర్లు తను అడిగిన సమయానికి ట్రీట్‌మెంట్ పూర్తికాదని చెప్పారని, దీంతో తానే బలవంతం చేశానని అన్నారు. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చాలా భాగం పూర్తయిన తర్వాత చేతికి కట్టుతో సినిమా షూటింగ్‌కు వెళ్లినట్లు ఆనాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు. అప్పటినుంచీ మణికట్టుపై నాడి స్పర్శను కోల్పోయానని చెప్పారు.

ఇంతకుముందు తన బ్లాగులో కూడా ఈ విషయాన్ని అమితాబ్ రాసుకున్నారు. బిగ్‌బీ ఆ సమయంలో చాలా సినిమాల్లో స్వయంగా స్టంట్స్ చేసేవారు. దీంతో ఆయన చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యారు. ముఖ్యంగా ‘కూలీ’ సినిమా సమయంలో పెద్ద ప్రమాదం జరగడంతో ముంబై ఆస్పత్రిలో చేరి చాలా రోజులు చికిత్స తీసుకున్నారు. అందుకే ఆయన అభిమానులు బిగ్‌బీ అసలు పుట్టినరోజు అక్టోబరు 11 అయినా, ఆగస్టు 2ను బిగ్‌బీ రెండో పుట్టినరోజుగా జరుపుకుంటారు.