కేబినెట్ విస్త‌ర‌ణ‌ విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం: ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేశ్

28-09-2021 Tue 12:40
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం
  • తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేశాం
  • తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
will abide by party decision says suresh

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూనే, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేశామని ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ చెప్పారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నగరం పాలెం సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సురేశ్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌కూ విద్య అందుబాటులో ఉండాలని, గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయని ఆదిమూల‌పు సురేశ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.  

ప్రైవేటు వ‌ర్సిటీల్లో 35 శాతం సీట్లు రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించిన ఫీజులకు బడుగు, బలహీన వ‌ర్గాల‌ విద్యార్థులకు కేటాయించాలని జ‌గ‌న్ ఆదేశించారని ఆదిమూల‌పు సురేశ్ వివ‌రించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌ విషయంలో త‌మ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.